ముంబై: నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఒక వ్యక్తి, అతడి సహాయకుడు కలిసి మహిళా రోగిని మోసగించారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. కొంధ్వా ప్రాంతంలో 44 ఏండ్ల హనీస్ అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ డాక్టర్ మాలిక్, అతడి సహాయకుడు జాహిద్ సలీం హుస్సేన్ కలిసి ఒక క్లీనిక్ నిర్వహిస్తున్నారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ముంబైకి చెందిన 73 ఏండ్ల వృద్ధురాలి నుంచి చికిత్స పేరుతో రెండు లక్షలు కాజేశారు.
వ్యాధి నయం కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు గత ఏడాది డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, హనీస్ అబ్దుల్ హమీద్ షేక్‌ను దొంగ డాక్టర్‌గా గుర్తించారు. అతడితోపాటు సహకరించిన అనుచరుడ్ని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ నకిలీ డాక్టర్ గతంలో కూడా పలువురు రోగుల నుంచి వైద్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసినట్లుగా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.