జైపూర్: ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. అమాయక వైద్యులను వేధించవద్దంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. రాజస్థాన్‌లోని దౌసాలో బుధవారం ఈ ఘటన జరిగింది. డాక్టర్ అర్చన శర్మ దంపతులు ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆ ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళ తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. అయితే ఆమె మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేశారు. డాక్టర్ అర్చనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ డాక్టర్‌పై హత్య కేసును పోలీసులు నమోదు చేశారు.
కాగా, ఈ ఘటనపై డాక్టర్ అర్చన మనస్థాపం చెందింది. తనపై హత్య కేసు నమోదు చేయడంపై కలత చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అమాయక వైద్యులను వేధించద్దంటూ సూసైడ్ నోట్లో రాసింది. తన చావుతోనైనా తన అమాయకత్వం తెలుస్తుందని పేర్కొంది. తన భర్త, పిల్లలను వేధించవద్దని అందులో కోరింది.
మరోవైపు, వైద్యురాలి ఆత్మహత్యపై వైద్య సంఘాలు బుధవారం నిరసన తెలిపాయి. ఆమెపై పోలీసులు హత్య కేసు నమోదు చేయడాన్ని ఖండించాయి. రాజస్థాన్ సీఎం కూడా వైద్యురాలి సూసైడ్‌పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలను కాపాడే వైద్యులు దేవుళ్లని అన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.