న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో అతడ్ని పైకి ఎత్తిపడేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ జ్ఞాన్ సింగ్, గురువారం సాయంత్రం దయాల్పూర్లోని షేర్పూర్ చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఒక వ్యక్తిని తరుముతున్న ఎద్దు, రోడ్డుపై నిల్చొన్న కానిస్టేబుల్ జ్ఞాన్ సింగ్‌పై వెనుక నుంచి దాడి చేసింది. వాడి కొమ్ములతో ఆయనను పైకి ఎత్తి పడేసింది. దీంతో ఆ పోలీస్ కానిస్టేబుల్ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు.
కాగా, అక్కడ విధుల్లో ఉన్న మిగతా పోలీస్ సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించారు. గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జ్ఞాన్ సింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడటంతో చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గత ఏడాది గుజరాత్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. వీధుల్లో తిరిగే ఒక ఎద్దు భావ్‌నగర్‌లో ఒక వ్యక్తిపై దాడి చేసింది. కొమ్ములతో అతడ్ని గాల్లోకి ఎత్తి విసిరేసింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు, వీధుల్లో తిరిగే ఎద్దులు, ఆవులను కట్టడి చేశారు. వాటిని పట్టుకుని పశు సంరక్షకులకు అప్పగించారు.