కారు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తికి షాక్ తగిలింది. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునే ప్రముఖ వేదిక ఓఎల్ఎక్స్లో సచిన్ త్యాగి (42) అనే వ్యక్తి తన ఎస్యూవీ కారును అమ్మకానికి పెట్టాడు. అది కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. టెస్టు డ్రైవ్ చేస్తానని చెప్పాడు.
దానికి సచిన్ ఒప్పుకున్నాడు. ఇద్దరూ కారులో కొంతదూరం వెళ్లి వచ్చారు. కారు తనకు నచ్చిందన్న నిందితుడు.. సచిన్ను కారు దిగమని చెప్పాడు. ముందుగా రూ.10వేలు అడ్వాన్స్ పేమెంట్ చేస్తానని చెప్పాడు. దీనికి సచిన్ అంగీకరించి కారు దిగగానే యాక్సిలరేటర్ నొక్కి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది. ‘కారు కొనేందుకు డీల్ కూడా ఓకే చేసుకున్నాం. మొత్తం 6 లక్షల రూపాయలకు కారు కొంటానని నిందితుడు చెప్పాడు. అతని మాటలు నమ్మి కారు దిగగానే పరారయ్యాడు’ అని సచిన్ వాపోయాడు. ఆ తర్వాత నిందితుడు తనకు ఫోన్ చేసిన నెంబరుకు కాల్ చేసినా ప్రయోజనం లేకపోయిందని, మొబైల్ స్విచాఫ్ అని వచ్చిందని చెప్పాడు.
దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని ట్రేస్ చేశారు. అతని వద్ద నుంచి ఎస్యూవీని స్వాధీనం చేసుకొని, నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు.