లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే జంక్షన్లో ఈ నెల 24వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడు నెలల పసికందు కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితుడిని పట్టుకున్నారు. ఆ పసిబాబును ఫిరోజాబాద్‌లోని బీజేపీ కౌన్సిలర్ వినితా అగర్వాల్ ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మథుర, ఆగ్రా, హాత్రాస్, కాస్గంజ్, బాదౌన్ ఏరియాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అయితే వినితా అగర్వాల్, భర్త కృష్ణ కలిసి ఫిరోజాబాద్‌లో ఉంటున్నారు. వీరికి 12 ఏండ్ల కుమార్తె ఉంది. కుమారుడు లేకపోవడంతో.. ఒక అబ్బాయిని దత్తత తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది వీలు కాలేదు. ఎలాగైనా కుమారుడు కావాలన్న తపనతో ఓ ఆస్పత్రిని సంప్రదించగా, వారు మథుర స్టేషన్లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. పసిబాబును కిడ్నాప్ చేసిన వ్యక్తిని దీపక్‌గా గుర్తించారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు డాక్టర్లతో పాటు దీపక్‌ను మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాబు కావాలని కోరిన వినితా అగర్వాల్ నుంచి డాక్టర్లు రూ. 1.8 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.