Bihar : ప్రపంచం ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే.. దేశంలో ఇంకోవైపు మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బిహార్ లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. చేతబడి, మంత్రాలు చేస్తోందనే ఉద్దేశంతో ఒక మహిళను దారుణంగా కొట్టి చంపారు. అంతేకాదు.. మరో ఇద్దరు మహిళలపైనా దాడి చేశారు. మృతురాలిని కిరణ్ దేవి (35)గా గుర్తించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో జరిగింది.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కిరణ్ దేవి ఇంటికి దగ్గర్లోనే ముఖేష్ చౌదరి, అతడి కుటుంబ సభ్యులు మహేంద్ర చౌదరి, నత్రు చౌదరి, శోభాదేవి ఉంటున్నారు. ఇటీవల ముఖేష్ చౌదరి కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. అతడికి మెదడుకు సంబంధించిన వ్యాధి సోకింది. కిరణ్ దేవి చేతబడి చేయడం వల్లే ఆ బాలుడికి అనారోగ్యం సోకిందని ముఖేష్ కుటుంబం అనుమానించింది. కిరణ్ దేవికి మంత్రాలు వచ్చని, ఆమె క్షుద్రపూజలు చేస్తుందని కొంతకాలంగా వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడి అనారోగ్యం విషయంలో మరింత ఆగ్రహానికి గురైన ముఖేష్, మహేంద్ర, నత్రు, శోభాదేవి కలిసి కిరణ్ దేవిపై దాడికి పాల్పడ్డారు. చేతిలో ఇటుక, రాళ్లు వంటివి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన కిరణ్ తోడి కోడళ్లపైనా తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా.. కిరణ్ దేవి మరణించింది. లలితా దేవితోపాటు మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉందని.. కొంతకాలంగా వీరి మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇరువైపులవారు దాడి చేసుకున్నారని.. రెండువైపులా ఐదారుగురు వరకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.