కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల నుంచి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానంతో తోటి విద్యార్థులు క్యాంపస్ సిబ్బందికి సమాచారం అందించారు. క్యాంపస్ సిబ్బంది విద్యార్థి తలుపులు తెరిచి చూడగా, అతను మృతి చెంది ఉన్నాడు. డెడ్‌బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉంది.
మృతుడిని ఫయాజ్ అహ్మద్(23)గా గుర్తించారు. మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఫయాజ్ స్వస్థలం అసోంలోని టిన్సుకియా. అహ్మద్ ఇటీవలే ఇంటి నుంచి క్యాంపస్‌కు తిరిగొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయితే ఇంటి నుంచి తిరిగొచ్చిన ఫయాజ్ గత రెండు రోజుల నుంచి కనిపించలేదు. తన గదికే పరిమితం కావడంతో.. అనుమానంతో మిగతా విద్యార్థులు క్యాంపస్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఈ ఘటన నిన్న వెలుగు చూసింది. అనంతరం అహ్మద్ కుటుంబ సభ్యులకు క్యాంపస్ సిబ్బంది సమాచారం అందించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.