లక్నో: చాకెట్లు తిని నలుగురు పిల్లలు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీనిపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీలిప్ నగర్ గ్రామానికి చెందిన ఒక ఇంటి వద్ద బుధవారం ఉదయం ప్లాస్టిక్ బ్యాగులో ఐదు చాకెట్లు, కొంత చిల్లర కనిపించింది. తెల్లవారుజామున ఇంటి బయట ఊడ్చుతున్న ముఖియా దేవి దీనిని గుర్తించింది. ఆ చాకెట్లను ఇంట్లోని ముగ్గురు పిల్లలైన మనవరాళ్లు మంజన (5), స్వీటీ (3), మనవడు సమర్ (2)తో పాటు పొరుగున నివసించే ఐదేళ్ల పిల్లాడు అరుణ్‌కు ఆమె ఇచ్చింది.
కాగా, ఆ చాకెట్లు తిన్న నలుగురు పిల్లలు కొంత సేపటికే అచేతన స్థితికి చేరారు. దీంతో ఆందోళన చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ పిల్లలు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. విషం కలిపిన చాకెట్లను పిల్లలు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.
మరోవైపు రెండేండ్ల కిందట కూడా బాధిత కుటుంబానికి చెందిన బంధువుల ఇంట్లో ఇలాంటి ఘటన జరిగిందని గొరఖ్‌పూర్ జోన్ ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు. ఎవరో కావాలనే విషం కలిపిన చాకెట్లను బాధిత కుటుంబం ఇంటి వద్ద ఉంచారని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశంతో ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.