Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. రోప్ వే కేబుల్ తెగిపోయిన ఘటనలో ఒకరు మరణించగా, 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నవరాత్రి సందర్భంగా, చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలోని ఖల్లారి మాత ఆలయంలో జరిగింది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3,000 అడుగల ఎత్తులో పర్వత ప్రాంతంలో ఉంటుంది. ప్రత్యేక వేడుకల కోసం చాలామంది భక్తులు వేకువఝాము నుంచే ఆలయానికి చేరుకున్నారు.
ఎత్తైన కొండపై ఈ గుడి ఉండటంతో కొందరు భక్తులు రోప్ వేను వినియోగిస్తారు. దీని ద్వారా ఆలయం ఉన్న కొండపైకి చేరుకుంటారు. దీనిలో భాగంగా కొందరు భక్తులు రోప్‌వే క్యాబిన్లో పైకి వెళ్తుండగా, మార్గమధ్యలో కేబుల్ రోప్ తెగిపోయింది. దీంతో రోప్‌ను పట్టుకుని ఉన్న క్యాబిన్లు కిందపడిపోయాయి. ప్రమాదం జరిగిన స్థలంలో బాధితులు సహాయం కోసం అర్థించారు. ఈ ఘటన కారణంగా అక్కడ ఆందోళనకర పరిస్తితి నెలకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించింది. 17 మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు బాధితుల్ని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అందులో ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ తరలించారు. వీరిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రోప్ వే తెగిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఖల్లారి మాత ఆలయం ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అందులోనూ నవరాత్రి సందర్భంగా మరింత మంది భక్తులు వస్తుంటారు.