డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారతీయ వినోదరంగంలో ఉన్న గుత్తాధిపత్యానికి సవాలు విసురుతున్నాయని చెప్పింది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. అదే సమయంలో ఔత్సాహికులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించేందుకు ఓటీటీ సులభమైన మార్గంగా మారిందని పేర్కొంది. అమెరికాలో జీ5 ఓటీటీ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రియాంకచోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా అంటే ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉండాలనే రొటీన్ ఫార్ములాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బ్రేక్ చేశాయి. ఇప్పుడు సార్వజనీనమైన గొప్ప కథల్ని ఓటీటీ వేదికల్లో చూస్తున్నాం. ఇండస్ట్రీలోని గుత్తాధిపత్యం వల్ల గతంలో కొత్త రచయితలు, దర్శకులు, ఆర్టిస్టులకు సినీ పరిశ్రమలో అవకాశాలు సంపాదించడం చాలా కష్టంగా ఉండేది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వల్ల పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి’ అని చెప్పింది. హాలీవుడ్లో రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని..తనలాగే ప్రతిభావంతులైన దక్షిణాసియా నటీనటులు హాలీవుడ్లో ప్రయత్నాలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ వేదికలపై భారతీయులు విజయం సాధించడం ఎప్పుడూ గర్వంగా ఉంటుందని ప్రియాంకచోప్రా చెప్పింది.