తొమ్మిదేళ్ల విరామం తర్వాత వైవీఎస్ చౌదరి మెగాఫోన్ పట్టనున్నారు. సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 2015లో ‘రేయ్’ సినిమాను తెరకెక్కించారాయన. ఆ తర్వాత సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ‘యాక్షన్.. కట్..’ చెప్పనున్నారు. నేడు వైవీఎస్ చౌదరి పుట్టినరోజు. అలాగే ఆయన అభిమాన దర్శకుడైన కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు కూడా నేడే. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు వైవీఎస్.
ఆయన తొలి చిత్రం ‘సీతారాముల కల్యాణం చూతమురారండి’ ద్వారా వెంకట్, ఛాందినీలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేసిన వైవీఎస్.. ‘లాహిరి లాహిరి లాహరిలో’ ద్వారా ఆదిత్య ఓం, అంకితలను, ‘దేవదాసు’ ద్వారా రామ్, ఇలియానాలను వెండితెరకు పరిచయం చేసి, కొత్తవారితో సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడిగా పేరు గడించారు. ఇప్పుడు మళ్లీ కొత్త నటీనటులతోనే హై టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన న్యూ ఏజ్ యూనిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించనున్నారు వైవీఎస్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు.