‘25 ఏళ్ల క్రితం తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్‌కి వెళ్లినప్పుడు నాతో అమ్మానాన్న తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు కోట్లాదిమంది నాతో ఉన్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల ఆశీస్సులు. అన్నింటినీ మించి మా తాతగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌గారి దీవెనలు. ఆయన చల్లని చూపు నాపై ఉన్నంతవరకూ ఎవరూ నన్నేం చేయలేరు. అభిమానుల్ని ఆనందింపజేయడమే నా ముందున్న లక్ష్యం. మీకోసం ఎంతదూరం అయినా వెళ్తా. ఎక్కడికెళ్లాలనుకున్నా మిమ్మల్ని తీసుకొనే, మీతోపాటు వెళ్తా.’ అని ఎన్టీఆర్ నర్మగర్భంగా మాట్లాడారు. ఆయన, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన భారీ పానిండియా సినిమా ‘వార్ 2’. కియారా అద్వానీ కథానాయిక. బ్లాక్‌బస్టర్ ‘వార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడారు. ఇంకా చెబుతూ “కహోనా ప్యార్హై’లో హృతిక్ డాన్స్ చూసి పిచ్చివాడ్నైపోయా. ఇండియాలో ఈ రోజు ఫైనెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది హృతిక్ రోషన్ మాత్రమే. ఆయన ఎంత గొప్ప నటుడో, అంత గొప్ప వ్యక్తి.
దేశంలో ఆయనంత డాన్సర్ లేరు. అలాంటి వ్యక్తితో డాన్స్ చేయడం, కలిసి నటించడం నా అదృష్టం. డాన్స్‌లో ఆయనతో పోటీ పడటం సాహసం. కనీసం మ్యాచ్ చేయడానికి ప్రయత్నించా. ఇది నా తొలి హిందీ సినిమా. అలాగే హృతిక్సార్ తొలి తెలుగు సినిమా. తెలుగువారి ఆదరణ ఎలా ఉంటుందో ఈ సినిమాతో నిరూపణ అవ్వడం ఖాయం. ఇది అయాన్ ముఖర్జీ సినిమా. దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదుగుతారు తను. అంత గొప్పగా ఈ సినిమా తీశారు ’ అని ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్ మాట్లాడుతూ ‘తారక్ మీకు అన్న. నాకు తమ్ముడు. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. ఎప్పటికీ ఈ బంధం ఇలాగే ఉంటుంది. మనం ఓ ఫ్యామిలీ. ‘క్రిష్’ షూటింగ్ టైమ్‌లో హైదరాబాద్ వచ్చాను. తెలుగు ప్రజల ఇచ్చే గౌరవం నాకు తెలుసు. నాలుగురోజుల్లో ‘వార్ 2’ రాబోతున్నది. ఇందులో కబీర్ పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశా. పులి లాంటి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఏ షాట్ అయినా వందశాతం న్యాయం చేసే గొప్ప నటుడు తారక్. అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు తను. తన నుంచి చాలా నేర్చుకున్నా. అదంతా నా ఫ్యూచర్ సినిమాల్లో అనుసరిస్తా.’ అని తెలిపారు. ప్రచార చిత్రాల్లో మేం చెప్పని ఓ అద్భుతమైన కథ ఈ సినిమాలో ఉందని, అది సర్ప్రైజ్కు గురిచేస్తుందని అయాన్ ముఖర్జీ చెప్పారు. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ కూడా మాట్లాడారు.