అగ్ర కథానాయిక సమంత అభినయప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న నాయికల్లో ఆమె ఒకరు. ‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్లో తమిళ రెబల్ రాజీ పాత్రలో అద్భుతాభినయం కనబరచి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ సిరీస్ విజయంతో ఈ చెన్నై చిన్నది బాలీవుడ్ సినిమాల వైపు దృష్టిపెడుతుందనే వార్తలు వినిపించాయి. కథానాయిక తాప్సీ నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమాను అంగీకరించిందనే వార్తలొచ్చాయి. వీటిపై ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చింది సమంత. మంచి కథ కుదిరితే తప్పకుండా హిందీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు భాషాపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవు. సినిమా ఎంచుకునే ముందు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటా. ఆ పాత్రకు నేను సరిపోతానా లేదా అని విశ్లేషించుకుంటా. నా మనసుకు నచ్చిన కథ దొరికితే బాలీవుడ్ సినిమా గురించి ఆలోచిస్తా. ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయితే ఆ గుడ్న్యూస్ గురించి స్వయంగా నేనే వెల్లడిస్తా. హిందీ సినిమా అరంగేట్రం కోసం కొంతకాలం వేచిచూడాల్సిందే’ అని చెప్పింది. ఆమె తెలుగులో నటించిన ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తిచేసుకుంది. మహాభారతంలోని ఓ ఘట్టం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు.