‘నేను కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చేశా. వాటన్నింటినీ మరిచిపోయి, నేను చేసిన మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నందుకు తెలుగు అభిమానులకు థాంక్స్. నేను 15 తెలుగు సినిమాల్లో నటిస్తే.. అందులో 13 విజయాలను సాధించాయి. విజయాలను మీరిచ్చారు. ఫ్లాపులు మాత్రం నేనే ఇచ్చాను. ఇది తీర్చలేని రుణం. ‘థగ్‌లైఫ్’ సినిమాను జూన్ 5న మీకు అందిస్తున్నా. నిజంగా గ్రేట్ ఫిల్మ్ ఇది. నాతోపాటు ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరూ అద్భుతమైన పాత్రలు చేశారు. గొప్ప సినిమా చేశామని మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకం నిజమా? కాదా? అనేది మీరే చెప్పాలి.’ అన్నారు కమల్‌హాసన్..
‘నాయకన్’ వచ్చిన 38ఏండ్ల విరామం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్‌లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ కీలక పాత్రధారులు. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయ్‌నిధి స్టాలెన్ నిర్మాతలు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విశాఖపట్టణంలో భారీగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులను ఉద్దేశించిన కమల్‌హాసన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, శ్రేష్ఠ్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.