Yellamma | ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతవరకు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్, ఇప్పుడు “ఎల్లమ్మ” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని బలగం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు తెరకెక్కించనున్నాడు. బలగం సినిమా ఎంత భారీ హిట్ సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన కథతో ఎల్లమ్మ అనే సినిమాని దర్శకుడు వేణు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
“ఎల్లమ్మ” సినిమాకు మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత నితిన్‌కి అవకాశం దక్కినప్పటికీ, నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించినప్పటికీ, అతనూ ఆ పాత్రను స్వీకరించలేదు. ఇంతలో, ఓ పెద్ద సర్ప్రైజ్ గా దేవీ శ్రీ ప్రసాద్ పేరు హీరోగా ఖరారు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముంది అనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే నిజమైతే దేవీ శ్రీ ప్రసాద్ తన నటనతో ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతి అందిస్తాడో చూడాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సరసన నటించే హీరోయిన్ కూడా కన్ఫాం అయిందని అంటున్నారు. అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట నుండి కీర్తి పేరు వినిపించగా, తాజా ప్రచారంతో హీరోయిన్ మార్పు ఉండదనే నిర్ధారణకు వస్తున్నారు సినీ ప్రియులు. ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నా కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుందని సమాచారం. ఇలా, ఎల్లమ్మ సినిమా హీరో, హీరోయిన్ కాంబినేషన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.