AP Politics | ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. పొలిటికల్ లీడర్స్ కంటే దర్శక నిర్మాతలే ఎక్కువగా పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ వాడుకొని పొలిటికల్ సినిమాలు చేసే దర్శకులు ఎక్కువగా ఉంటారు. వాటిని క్యాష్ చేసుకోవాలని చూసే నిర్మాతలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కొందరు కొన్ని పార్టీలకు అనుకూలంగా సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో ఎక్కువగా అలాంటి సినిమాలు మన దగ్గర రాలేదు. కానీ ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి పొలిటికల్ సినిమాలు రెడీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో అందరి కంటే ముందు యాత్ర 2 సినిమా రానుంది.
2019 ఎలక్షన్స్ కు ముందు మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. 2003 సమయంలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. వైసీపీ విజయానికి ఎంతో కొంత యాత్ర కూడా బాగానే ఉపయోగపడింది. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాతో వస్తున్నాడు మహి వీ రాఘవ్. ఇందులో జగన్ చేసిన పాదయాత్ర గురించి ఎక్కువగా హైలెట్ చేస్తున్నాడు. అయితే యాత్రను ఎవరిని కించపరచకుండా కేవలం ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన మహి.. దాని సీక్వెల్ మాత్రం వన్ సైడ్‌గా రూపొందించాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జగన్ కోసమే ఈ సినిమా తీశారని అందులో ఆయనను హీరో చేయడం కోసం మిగిలిన వాళ్లను విలన్లుగా చూపిస్తున్నారు అనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే టీడీపీకి అనుకూలంగా రాజధాని ఫైల్స్ అంటూ ఒక సినిమా వస్తుంది. ఏపీలో రాజధాని ఇష్యూపై మూడు నాలుగు సంవత్సరాలుగా రగడ నడుస్తూనే ఉంది. దీన్ని హైలైట్ చేస్తూ రాజధాని ఫైల్స్ అనే సినిమా తీసుకొస్తున్నారు. ఇది కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు కాకుండా వర్మ వ్యూహం ఎలాగూ ఉంది. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. అలాగే వాళ్ల కోసం వచ్చే సినిమాలు కూడా అంతే రసవత్తరంగా ఉన్నాయి. మరి వీళ్ళలో పై చేయి ఎవరు సాధిస్తారనేది చూడాలి.