Yash | కన్నడ స్టార్ హీరో యశ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెరపై మాస్ హీరోగా కోట్లాది అభిమానులను అలరిస్తున్న ఆయన, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకునే పని చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన వీరాభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించడంతో ప్రస్తుతం యశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్ విజయంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంతో పాటు, ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, తన అభిమాని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం అందరినీ ఆకట్టుకుంటోంది.
సమాచారం ప్రకారం, శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న సునీల్ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. తన అభిమాన హీరోను అమితంగా అభిమానించే సునీల్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న యశ్ వెంటనే స్పందించారు. స్వయంగా వీడియో కాల్ చేసి సునీల్‌తో మాట్లాడిన ఆయన, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ధైర్యంగా ఉండాలని సూచించారు. వీడియో కాల్ సందర్భంగా యశ్ మాట్లాడిన మాటలు సునీల్‌కు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా అభిమానిస్తున్న హీరో స్వయంగా పలకరించడంతో సునీల్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. అంతేకాకుండా చికిత్సకు అవసరమైన సహాయం విషయంలో తాను ఎప్పుడూ అండగా ఉంటానని యశ్ హామీ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల పట్ల యశ్ చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్డమ్ వచ్చిన తర్వాత అభిమానులను దూరంగా పెట్టే సెలబ్రిటీల మధ్య, ఇలాంటి సందర్భాల్లో వారికి అండగా నిలవడం నిజంగా గొప్ప విషయమని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ‘రామాయణ’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఆయన పాత్రపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, అభిమానుల పట్ల ప్రేమను మాత్రం తగ్గించుకోని యశ్ మరోసారి తన వినయంతో అందరి మనసులు గెలుచుకున్నారు.