కన్నడ అగ్ర హీరో యష్ నటించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అయినప్పటికీ.. మనోవిశ్లేషణతో కూడిన కథాంశమని, డార్క్ క్యారెక్టర్‌ను దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పాజిటివ్‌గా ఆవిష్కరించారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యష్ తెలిపారు. దీంతో గ్యాంగ్‌స్టర్, సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తున్నది. తాజాగా ఈ సినిమాను రీషూట్ చేస్తున్నారని, ఫైనల్ అవుట్‌పుట్‌పై యష్ సంతృప్తిగా లేరని, అందుకే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
వీటిపై చిత్రబృందం స్పందించింది. ఇవన్నీ పుకార్లని, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషనల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టామని స్పష్టం చేసింది. ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేస్తుండటంతో హీరో యష్ విదేశీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుందని సమాచారం. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వాణీ, హ్యుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు.