‘ఈ ప్రపంచంలో ప్రతీ వంద కిలోమీటర్లకు భాష, సంస్కృతి, సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. అయితే ‘టాక్సిక్’ కథాంశం మాత్రం అందరికి కనెక్ట్ అవుతుంది. లోతైన మనోవిశ్లేషణతో మనల్ని మనం తెరపై చూసుకున్న అనుభూతినిస్తుంది’ అన్నారు చిత్ర కథానాయకుడు యశ్. ఆయన తాజా చిత్రం ‘టాక్సిక్’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. లాస్ వెగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో హీరో యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
“టాక్సిక్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. పైకి చూస్తుంటే ఇదొక రెగ్యులర్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ మూవీలా అనిపిస్తుంది. కానీ లోతైన మనోవిశ్లేషణతో మానవ సంబంధాలను నిర్వచిస్తుంది. ఓ డార్క్ క్యారెక్టర్‌ను చాలా గొప్పగా చూపించారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ గ్యాంగ్‌స్టర్ చిత్రాలకు చిరునామాలా తీర్చిదిద్దారు. ఆడియన్స్ సైకాలజీ మీద ఈ సినిమా చాలా ప్రభావం చూపిస్తుంది’ అని యశ్ తెలిపారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వాణీ, హ్యుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.