వాణిజ్య అంశాల్ని, వినోదాన్ని సమపాళ్లలో కలబోసి జనరంజకమైన సినిమాల్ని రూపొందించడం సాధారణ విషయం కాదు. కానీ ఆ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. వినోదమే బలంగా అనతికాలంలోనే అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఎఫ్-3’ ఫిబ్రవరిలో ప్రేక్షకులముందుకురానుంది. నేడు దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినం. ఈ సందర్భంగా సోమవారం ఆయన పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
ఈ పుట్టినరోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారు?
దర్శకుడిగా మారిన తర్వాత జరుపుకొంటున్న ఆరో జన్మదినోత్సవమిది. చిత్రసీమలో ఒక్కో మెట్టెక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. ప్రతి అడుగులో పదిలపరచుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కరోనా సంక్షోభం తాలూకు సమస్యలతో పాటు మనరోజు వారి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించే ఓ ఔషదంలా ‘ఎఫ్-3’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. పుట్టినరోజున కూడా సినిమా సెట్లో ఉంటున్నా. అదే ప్రత్యేకమనుకుంటున్నా.
సంక్రాంతి బరిలో ‘ఎఫ్-3’ లేకపోవడం నిరుత్సాహపరిచిందా?
ఏ దర్శకనిర్మాతైనా సంక్రాంతికి తమ సినిమా రావాలని కోరుకుంటారు. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్-2’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు కూడా సంక్రాంతికే విడుదలై పెద్ద విజయాలు సాధించాయి. కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాబోవు సంక్రాంతి బరిలో భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటి మధ్యలో మా చిత్రాన్ని తీసుకురావడం ఇష్టం లేక ఫిబ్రవరిలో రిలీజ్‌కు సన్నాహాలు చేశాం.
‘ఎఫ్-3’ మూడింతల వినోదం అని చెబుతున్నారు.. ఇందులో హాస్యం ఎలా ఉండబోతున్నది?
‘ఎఫ్-2’లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ చూశారు. ఈ సినిమాలో ఫ్రస్ట్రేషన్ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. మీరందరూ ఊహించినదానికంటే ఓ మోతాదు ఎక్కువగానే హాస్యం ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటితో బాధపడుతుంటాడు. వరుణ్‌తేజ్‌కు కొంచెం నత్తి ఉంటుంది. వాళ్లకుండే ఆ సమస్యల నుంచి కూడా చక్కటి వినోదం పండుతుంది. తొలుత సీక్వెల్ అనుకున్నప్పుడు ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటామా? అనే సందేహాలొచ్చాయి. కథ సిద్ధం అయ్యాక తప్పకుండా ప్రేక్షకులకు మూడింతల వినోదం అందించగలమనే నమ్మకం కలిగింది.
ఈ రెండు భాగాల మధ్య కామెడీపరంగా ఎలాంటి ప్రత్యేకత కనిపిస్తుంది?
‘ఎఫ్-2’లో డైలాగ్, విభిన్నమైన మేనరిజమ్స్ ద్వారా హాస్యాన్ని పండించాం. కానీ ‘ఎఫ్-3’లో సంభాషణల కంటే పాత్రధారులు చేసే పనులు, వారి అయోమయం నుంచి కామెడీ పుడుతుంది. సందర్భోచితమైన వినోదంతో ఆకట్టుకుంటుంది. ఈ రెండో భాగంలో సునీల్, మురళీశర్మ వంటి నటులు జత కావడం కూడా ప్లస్‌పాయింట్‌గా కనిపిస్తుంది.
ఈ సినిమాలో భారీ తారాగణం కనిపిస్తుంది. అంతమందిని కథలో డీల్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా?
కథాపరంగా అంతటి భారీ తారాగణం అవసరమయింది. ైక్లెమాక్స్ సన్నివేశాల్ని 35 మంది ఆర్టిస్టులతో తీయడం ఛాలెజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీస్తున్నప్పుడు దివంగత ఈవీవీ సత్యనారాయణగారు గుర్తొచ్చారు. ఆయన సినిమాల్లో కూడా ఇలాగే ఎక్కువమంది నటీనటులు ఉండేవారు.
ఇద్దరి హీరోలతో సినిమా అంటే కథాపరమైన ప్రాధాన్యతలు, ఇమేజ్ను బ్యాలెన్స్ చేసే ఇబ్బందుల్ని ఎలా అధిగమించారు?
‘ఎఫ్-2’లో వెంకటేష్, వరుణ్‌తేజ్ మధ్య సమీకరణాలు చక్కగా కుదిరాయి. ఈ సినిమాలో కూడా అదే కెమిస్ట్రీ కొనసాగింది కాబట్టి ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదు.
బాలకృష్ణతో చేయబోతున్న సినిమా గురించి..?
బాలకృష్ణగారి ఇమేజ్‌కు తగినట్లుగా కథను సిద్ధం చేశా. యాక్షన్ హంగులు ఎక్కువగా ఉంటాయి. నా శైలి కామెడీ అక్కడక్కడా కనిపిస్తుంది. జూన్ లేదా జూలైలో ఆ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుంది.
‘ఎఫ్-3’ చిత్రంలో ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే అద్భుతమైన అంశాలుంటాయి. పెద్దలు, పిల్లలు అందరికి నచ్చుతుంది. సినిమా చూస్తూ ‘మా ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలున్నాయి కదా’ అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఎక్కడో ఓ చోట ప్రస్ట్రేషన్‌కు గురవుతుంటారు. కుటుంబం, వృత్తి, వ్యాపారం ఎక్కడైనా ఫ్రస్ట్రేషన్ కామనే. ఈ పాయింట్‌ను సంపూర్ణ వినోదంతో చూపించాం.