War 2 | సినిమా పానిండియా రంగు పూసుకున్న తర్వాత.. సౌత్ సినిమాలకు నార్త్‌లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే.. నార్త్ సినిమాలకు మాత్రం సౌత్‌లో అనుకున్నంత గిరాకీ లేనిమాట వాస్తవం. ఈ విషయంలో బాలీవుడ్ కాస్త అసహనంగానే ఉంది. అయితే.. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ‘వార్ 2’ విషయంలో మాత్రం సౌత్‌లో కూడా మంచి బజ్ ఉంది. కారణం ‘ఎన్టీఆర్’.
ఈ సినిమాలో తారక్ పాత్ర హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఉంటుందని, ఆయనపై ప్రత్యేకంగా పాటలు, డ్యాన్సులు కూడా ఉంటాయని, భారీ పోరాట సన్నివేశాలను కూడా తారక్‌పై తీశారని, ఇందులో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని.. ఇలా రకరకాల వార్తలు మీడియా సర్కిల్స్‌లో వినిపించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో ‘వార్ 2’పై అంచనాలు అంబరాన్ని తాకాయి.
దాంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా టాలీవుడ్లో మంచి ఫామ్‌లో ఉన్న ఇద్దరు అగ్ర నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. ‘వార్ 2’ తెలుగు హక్కులు 120కోట్ల మేరకు పలికే అవకాశం ఉందని సమాచారం. గతంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాను కూడా 120కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే.