హైదరాబాద్: టెన్నిస్ హేమాహేమీలు వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వాళ్లను సూపర్ స్టార్ల తరహాలో తీర్చిదిద్దింది వాళ్ల తండ్రి రిచర్డ్ విలియమ్స్. వీనస్, సెరీనాలను మేటి ప్లేయర్లుగా మార్చేందుకు రిచర్డ్ ప్రయత్నించాడు. ఎలా తమ పిల్లల్ని ఉత్తమ టెన్నిస్ ప్లేయర్లుగా తయారు చేశాడన్నదే కింగ్ రిచర్డ్స్ చిత్రం ఇతివృత్తం. రిచర్డ్ విలియమ్స్ జీవిత చరిత్ర ఆధారంగా కింగ్ రిచర్డ్స్ ఫిల్మ్‌ను తీశారు. ఆ సినిమాలో రిచర్డ్ పాత్రను విల్ స్మిత్ పోషించాడు. ఇవాళ జరిగిన ఆస్కార్స్ వేడుకలో విల్ స్మిత్.. ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.
రీనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహించిన కింగ్ రిచర్డ్ చిత్రంలో బ్లాక్ హీరో విల్ స్మిత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మేటి ప్లేయర్లను తీర్చిదిద్దాలంటే తల్లితండ్రులు ఎలా ఉండాలో కూడా ఈ పాత్రతో మెప్పించాడు. చాలా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న రిచర్డ్.. తన కూతుళ్లను బెస్ట్ టెన్నిస్ ప్లేయర్లుగా మార్చుతాడు. ఇక ఫిల్మ్‌లో రిచర్డ్ పాత్రతో విల్ స్మిత్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. అయిదుగురి కూతుళ్లలో ఇద్దర్ని టెన్నిస్ వైపు మళ్లించిన రిచర్డ్ చాలా కష్టపడుతాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. ప్రతిరోజూ వీనస్, సెరీనాలను టెన్నిస్ శిక్షణకు తీసుకువెళ్లుతాడు. శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్ ఆటలో ఎలా నల్లజాతి వాళ్లు రాణించాలో తన స్పూర్తిదాయక పాత్రలో స్మిత్ చూపించారు.
వీనస్, సెరీనాలను ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడలో సక్సెస్ఫుల్ అథ్లెట్లుగా రిచర్డ్ మారుస్తాడు. ఆ ప్రక్రియ సాగిన తీరును విల్ స్మిత్ తన పాత్రలో వ్యక్తీకరిస్తాడు. కాలిఫోర్నియాలో ఓ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సెరీనా, వీనస్‌లు.. చివరకు ఎలా ప్రొఫెషనల్‌గా మారుతారో ఈ ఫిల్మ్‌లో చూపించారు. దీని కోసం తండ్రి పడ్డ తపన అంతా ఇంతా కాదు. ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన రిచర్డ్.. ఎలా తన పిల్లలకు శిక్షణ ఇస్తాడో చూడాల్సిందే. తనదైన స్టయిల్లో ప్లాన్లు వేస్తూ.. పిల్లల్ని రాకెట్ క్రీడలో రాటుదేలేలా చేస్తాడు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండే థ్రిల్స్ ఈ ఫిల్మ్‌లో ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం తండ్రి తపన ఈ ఫిల్మ్‌లో కనిపిస్తుంది. రిచర్డ్ విలియమ్స్ పాత్రలో విల్ ప్రదర్శించిన నటన అద్వీతయం.
పేదరికాన్ని జయించాలంటే సక్సెస్ అనివార్యమన్న ఉద్దేశంతో తన పిల్లలకు రిచర్డ్ శిక్షణ ఇస్తాడు. చాలా కఠిన నిర్ణయాలతోనూ వాళ్లు ఇబ్బందిపెడుతాడు. కానీ తన లక్ష్యాన్ని మాత్రం మార్చుకోడు. అనుక్షణం నియంతలా వ్యవహరిస్తూ.. వీనస్, సెరీనాలను కోర్టుల చుట్టూ తిప్పుతూనే ఉంటాడు. ఫ్లోరిడాకు తీసుకువెళ్లి మరీ శిక్షణ ఇప్పిస్తాడు. కొన్ని జూనియర్ చాంపియన్‌షిప్ మ్యాచుల్లో ఆడిస్తూ.. వీనస్, సెరీనాలకు ప్రొఫెషనల్‌గా మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ సన్నివేశాల్లో విల్ స్మిత్ తన నటనతో అదరగొట్టాడు. ఏదీ ఊరికే రాదు.. ఎవరి నుంచి ఉచితంగా ఏదీ తీసుకోవద్దు.. అన్నింటికీ కొండ్లు ఉంటాయని స్మిత్ కొట్టిన డైలాగ్ అద్భుతం.
జూనియర్స్ టోర్నీల్లో ఎక్కువగా ఆడిస్తే, సత్తా తగ్గుతుందని గ్రహించి.. వీనస్ సెరీనాలను ఆ టోర్నీలకు దూరంపెడుతాడు. ఓ దశలో చాలా క్రూరంగా కూడా రిచర్డ్ తన పిల్లలతో ఉన్నట్లు అనిపిస్తుంది. వీనస్‌కు పాపులారిటీ వస్తున్న సమయంలో స్పాన్సర్షిప్ ఒప్పందాలకు దూరంగా ఉంచుతాడు. ప్లాన్‌కే కట్టుబడి ఉండాలని, ప్రొఫెషనల్‌గా సక్సెస్ సాధించడం ఓ ప్రక్రియ అని, ఆ ప్రక్రియను కొనసాగించాలని రిచర్డ్ తన పిల్లలకు చెబుతాడు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో వీనస్, సెరీనాలు ఎన్నో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచారు. ఆ క్రెడిట్ అంతా రిచర్డ్దే అన్న రీతిలో కింగ్ రిచర్డ్ సినిమా ఉంటుంది. ఇక రిచర్డ్ పాత్రలో విల్ స్మిత్ తన నటనతో గ్రాండ్‌స్లామ్ కొట్టేశాడు. ఇవాళ జరిగిన ఆస్కార్స్ వేడుకలో విల్ స్మిత్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది.