Hanuman | సంక్రాంతి సినిమాలు ఏది వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అనుకున్నట్టుగానే అన్ని సినిమాలు కచ్చితంగా చెప్పిన తేదీకి వచ్చేలా కనిపిస్తున్నాయి. దానికి తోడు తమిళ సినిమాలు కూడా మేమున్నాము అంటూ గుర్తు చేస్తున్నాయి. జనవరి 12న శివ కార్తికేయన్ నటించిన ఆయలాన్ సినిమా విడుదల కానుంది. అసలు దీనికి థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే మన సినిమాలకే థియేటర్లు దొరకడం లేదు.. మళ్లీ డబ్బింగ్ సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆసక్తిగా చర్చ జరుగుతుంది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా డబ్బింగ్ సినిమాలు ఇప్పుడు కాదు తర్వాత విడుదల చేసుకోండి అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఇండస్ట్రీలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సంక్రాంతి సినిమాలలో అన్నింటికంటే ముందు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న హనుమాన్ సినిమా విషయంలోనే మళ్లీ మళ్లీ అన్యాయం జరుగుతుందని వాదన ఎక్కువైపోయింది.
అంతగా ఆ సినిమాను ఏమి చేశారో అనుకోవచ్చు.. కానీ జనవరి 12న గుంటూరు కారంతో పాటు ఈ సినిమాను విడుదల చేయాలి అనుకోవడమే నిర్మాతలకు శాపంగా మారేలా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో ఉన్న 96 సింగిల్ థియేటర్స్ లో 90 వరకు దిల్ రాజు ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం జనవరి 12న హనుమాన్కు కనీసం 5 థియేటర్లైన దొరుకుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ రెండు సినిమాలతో పాటు శివ కార్తికేయన్ అయలాన్ సినిమా కూడా వస్తుంది. కాబట్టి కనీసం దానికి మొక్కుబడి కోసమైనా ఒక్క థియేటర్ అయినా ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్కన హనుమాన్ 4 థియేటర్లు, శివ కార్తికేయన్ సినిమా ఒక థియేటర్లో ఉంటాయి. మిగిలిన 90 థియేటర్ల్లో మహేశ్ బాబు గుంటూరు కారం ఉంటుందన్నమాట.
ఒకవేళ ఇదే జరిగితే మాత్రం హనుమాన్కు అంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదు అనేది ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు చెప్తున్న మాట. ఒక పెద్ద సినిమాకు పోటీగా రావడం అంటే చిన్న సినిమాలకు ఎప్పుడు అంత ఈజీ కాదు.. కానీ ఈసారి ఇది మరింత కష్టం అయ్యేలాగా అనిపిస్తుంది. దానికి తోడు హనుమాన్ నైజాం రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు. వీళ్లతో దిల్ రాజుకు రెండు మూడు సంవత్సరాలుగా ఏదో ఇన్సైడ్ వార్ జరుగుతూనే ఉంది. దానికి తోడు 2023 సంక్రాంతి సమయంలో వాళ్లు సపరేట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేయడంతో వీళ్ల పంచాయతీ బయటపడింది. అప్పుడు కూడా వారసుడు విషయంలో దిల్ రాజుకు చాలా ఒత్తిడి వచ్చింది. చివరికి ఆయనే తగ్గి రెండు మూడు రోజులు ఆలస్యంగా సినిమాను విడుదల చేశాడు. అయితే ఇప్పుడు మహేశ్ బాబు సినిమా దిల్ రాజు చేతిలో ఉంది కాబట్టి ఎవరు ఏమి మాట్లాడలేకపోతున్నారు.
మరోవైపు హనుమాన్ లాంటి చిన్న సినిమాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇండస్ట్రీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోతుందని ఓ వర్గం బాగా బలంగా మాట్లాడుతుంది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చూడాలి. జనవరి 12న హనుమాన్ విడుదల కానుంది. అప్పటి వరకు దిల్ రాజు ఏదైనా వెనక్కి తగ్గి కొన్ని థియేటర్లు అయినా ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుంటూరు కారం సినిమాను కచ్చితంగా రికార్డు థియేటర్లలో విడుదల చేయాలి అని అభిమానుల నుంచి నిర్మాతలకు ఒత్తిడి పెరిగిపోతుంది. మరి ఇన్ని ప్రెషర్స్ మధ్య హనుమాన్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..!