Javed Akhtar | ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ పేరు వింటే చాలు ఎన్నో మరపురాని మధురమైన గీతాలు స్ఫురణకు వస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాలుగా అర్థవంతమైన, హృదయాలను రంజింపజేసే పాటలతో బాలీవుడ్ సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారాయన. షారుఖ్‌ఖాన్ ‘డంకీ’ చిత్రంలో జావేద్ అక్తర్ రాసిన ‘నిక్లే థే కభీ హమ్ ఘర్ సే’ గీతం మ్యూజిక్ ఛార్ట్స్‌లో అగ్ర భాగాన కొనసాగుతున్నది. ఈ పాటకు జావేద్ అక్తర్ 25లక్షల రెమ్యునరేషన్ తీసున్నారట.
ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘సింగిల్కార్డ్తో పాటలు రాయడం నాకు అలవాటు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఒకే ఒక్క పాట రాయమని కోరడంతో సున్నితంగా తిరస్కరించాను. ఎలాగైనా నేనే పాట రాయాలని అతను పట్టుబట్టాడు. సినిమా పట్ల అతనికున్న పాషన్ చూసి కాదనలేకపోయా. మ్యూజిక్ ఛార్ట్స్ ఈ గీతం అగ్రభాగాన కొనసాగడం చాలా ఆనందంగా ఉంది’ అని జావేద్ అక్తర్ అన్నారు. భారతీయ సినీ చరిత్రలో ఓ పాటకు తీసుకున్న అత్యధిక పారితోషికం ఇదేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.