ప్రేక్షకుల హృదయాల్ని కదిలించే అర్థవంతమైన కథల్లో నటించడం గొప్ప సంతృప్తినిస్తుందని చెప్పింది సీనియర్ నటి అక్కినేని అమల. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె తెలుగులో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమాలో తల్లి పాత్రలో అమల నటన అందరి హృదయాల్ని కదిలిస్తున్నది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా అక్కినేని అమల శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించింది. సినిమాకొస్తున్న ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తన మనసులోని భావాల్ని పంచుకుంది.
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తర్వాత నేను తెలుగులో నటించిన చిత్రమిది. ఈ మధ్యకాలంలో మలయాళంలో రెండు సినిమాలు, ఓ వెబ్‌సిరీస్‌తో పాటు హిందీ ప్రాజెక్ట్‌లు కూడా చేశాను. గత ఐదేళ్లుగా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ బిజీగా ఉన్నా. దాంతో తెలుగు సినిమా చేయడం కుదరలేదు. చాలా విరామం తర్వాత ‘ఒకే ఒక జీవితం’ వంటి హృదయాన్ని కదిలించే కథ నా దగ్గరకు వచ్చింది. ఓ ఎమోషనల్ స్టోరీ ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని తిరిగి పలకరించడం ఆనందంగా ఉంది.
ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యే ఇలాంటి పాత్రలు చేసినప్పుడే ఆర్టిస్టులకు సంతృప్తి దొరుకుతుంది. అయితే ఈ తరహా పాత్రల్ని పోషించడం అంత సులువు కాదు. కథలోని ఆత్మను మొత్తం ఆకళింపు చేసుకొని పాత్ర తాలూకు భావోద్వేగాల్ని పండించాల్సి ఉంటుంది. ఇలాంటి అర్థవంతమైన కథల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
సినిమా కోసం నాగార్జునగారిని ముందే ప్రిపేర్ చేశాను. సరదాగా చూసే సినిమా కాదిది..మన హృదయాల్ని కదిలిస్తుంది..ఇష్టమైన వ్యక్తుల్ని గుర్తుకు తెస్తుందని చెప్పాను. సినిమా చూశాక ఆయనకు వాళ్ల అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు. చాలా ఎమోషనల్ అయ్యారు. నా నటన హార్ట్‌టచింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి ఉద్వేగానికే లోనవుతున్నారు.
నేను పదేళ్ల ముందుకెళ్లిపోతా (నవ్వుతూ). నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇష్టం. మనం ఇప్పుడు మొదలుపెట్టే పనులు భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయా లేదా అన్నది తెలుసుకుంటే చాలా ఎక్పైయిటింగ్గా అనిపిస్తుంది .అందుకే భవిష్యత్తులోకి వెళ్దామనుకుంటున్నా.
‘లైఫ్ ఈజ్ ది రిహార్సల్ ఫర్ ది రైట్ టైమ్’అని నేను అనుకుంటా. జీవితం మనకు ఇచ్చిన ప్రతి అవకాశంలో విజయం కోసమే ప్రయత్నిస్తాం. జయాపజయాలు ఎలా ఉన్నా…ప్రతి అనుభవం ద్వారా పాఠాల్ని నేర్చుకుంటూ ముందుకు సాగుతాం. ఆ అనుభవాలే విజయానికి బాటలు వేస్తాయని నేను నమ్ముతా.
నాగార్జున, చైతు, అఖిల్ వాళ్ల సినిమాల గురించి మాట్లాడుకుంటారు. నేను మాత్రం మా ఫిల్మ్ స్కూల్లో ఎక్కువగా సినిమాల గురించి చర్చిస్తుంటా. విద్యార్థులతో ప్రపంచ సినిమాల గురించి లోతైన విశ్లేషణలు చేస్తుంటాం.