RRR | ఇంకా కొన్ని గంటలే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ఫీవర్ పట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్‌లోనే సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే.. ఇక విడుదల తర్వాత సినిమా ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో అని సినీ అభిమానులు అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక.. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సోషల్ మీడియాలో చర్చలే. సినిమా స్టోరీ విషయం కావచ్చు.. సినిమా పేరు విషయంలో కావచ్చు.
నిజానికి.. ఈ సినిమాను ప్రకటించినప్పుడు.. ఒక పేరు ఉండాలని ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ అనే పేరు పెట్టారు రాజమౌళి. అది కేవలం ప్రాజెక్టు పేరు మాత్రమే. సినిమా పేరు కాదు. రామ్ చరణ్, రామారావు(జూనియర్ ఎన్టీఆర్), రాజమౌళి పేర్లలో మొదటి మూడు అక్షరాలు ఆర్ కావడంతో ఆర్ఆర్ఆర్ అని ప్రాజెక్ట్ పేరు పెట్టారు.
కొన్ని రోజుల తర్వాత సినిమా పేరు ప్రకటిస్తామని చెప్పినా.. అందరూ ఆర్ఆర్ఆర్ పేరుతోనే ఈ సినిమాను రెఫర్ చేయడం, సోషల్ మీడియాలో కూడా ఆర్ఆర్ఆర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం.. ఆర్ఆర్ఆర్ పేరే బాగుందని సినీ అభిమానులు చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అదే పేరును సినిమాకు ఖరారు చేశారు.
తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ అంటే తెలుగులో రౌద్రం, రణం, రుధిరం అని అర్థం వచ్చేలా పేరు పెట్టారు. హిందీ, ఇంగ్లీష్‌లో అయితే రైజ్, రోర్, రివోల్డ్ అని ఆర్ఆర్ఆర్ కలిసేలా పేరు పెట్టారు జక్కన్న.
ఇదే విషయాన్ని రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గతంలో ఓసారి కపిల్ శర్మ షోకు వెళ్లినప్పుడు కూడా జక్కన్న.. ఎందుకు ఆర్ఆర్ఆర్ అని సినిమాకు పేరు పెట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.
మొదట్లో ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. ముందు సినిమా పేరు కంటే.. ఈ ప్రాజెక్ట్‌కు ఒక పేరు పెట్టాలనుకున్నాం. అందుకే.. ఆర్ఆర్ఆర్ అని మా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాన్ని తీసుకొని ప్రాజెక్ట్ పేరుగా పెట్టాం. ఆ తర్వాత పేరు మారుద్దాం అనుకున్నాం. కానీ.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించగానే.. సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ పేరుతో హ్యాష్‌ట్యాగ్స్ క్రియేట్ చేయడం, ఆర్ఆర్ఆర్ టైటిలే బాగుందని చాలామంది సలహాలు ఇవ్వడంతో ఇక అదే పేరును ఖరారు చేశాం అని రాజమౌళి చెప్పుకొచ్చారు.