అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘లవ్ ఓటిపి’. జాన్విక, స్వరూపిణి కథానాయికలు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఒకరికి తెలీకుండా, మరొకరిని.. ఇలా ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించి ఇబ్బందుల్లో పడ్డ అబ్బాయి కథ ఇదని ట్రైలర్ చెబుతున్నది. బెంగళూర్‌లో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. ప్రేమంటే అస్సలు పడని తండ్రిగా ఇందులో ఆయన నటిస్తున్నట్టు ట్రైలర్లో తెలుస్తున్నది.
ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇదని, ఇందులో పాత్రలన్నీ కొత్తగా ఉంటాయని, అటు హీరోగా, ఇటు దర్శకునిగా అనీష్‌కు పెద్ద సక్సెస్‌ని ఈ సినిమా అందిస్తుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ప్రమోదిని, నాట్యగంగ, తులసి, అన్నపూర్ణ, చేతన్ గంధర్వ, రవిభట్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హర్ష, సంగీతం: ఆనంద్ రాజా విక్రమ్, నిర్మాణం: భవప్రీతా ప్రొడక్షన్స్.