‘అరవింద్‌గారు సినిమా కథ విన్న వేళా విశేషం, శోభితను నాగచైతన్య పెళ్లాడిన వేళావిశేషం రెండూ బావున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో మేం ఢిల్లీలో మోడీగార్ని కలవడానికి వెళ్లాం. సక్సెస్ అయ్యిందని ఒకటే మెసేజ్‌లు. ఇలాంటి విజయాన్ని చూసి చాలాకాలమైంది. ఇంతటి మంచి లవ్‌స్టోరీ చేసిన అరవింద్‌గారికి థ్యాంక్స్. ‘గజని’ సినిమాతో తొలి వందకోట్ల సినిమా తీసి రికార్డ్ సృష్టించారాయన. ఈ సినిమాకు కూడా వందకోట్లు వస్తాయంటున్నారు. ఇలాంటి విజయాలు ఆయనకు కొత్త కాదు. చందూ మొండేటి అద్భుతంగా తీశాడు. ఇక సాయిపల్లవిలో కనిపించే ప్యూరిటీ ఆమె చేసిన పాత్రలోనూ కనిపించింది. రెండేళ్లు ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డాడు చైతూ. ఇందులో చైతూ నటన చూస్తే నాన్నగారు గుర్తొచ్చారు.’ అని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన తనయుడు నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం ‘తండేల్’.
సాయిపల్లవి కథానాయిక. చందూ మొండేటి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. అక్కినేని శోభిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. నాగచైతన్య మాట్లాడుతూ ‘వస్తున్న స్పందన చూస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది. ‘100పర్సంట్ లవ్’ నా కెరీర్‌కి ఎంత బూస్ట్ ఇచ్చిందో.. ఈ సినిమా అంతకు మించి బూస్ట్ ఇచ్చింది. అందుకే అరవింద్‌గారికి థ్యాంక్స్. చందూ మొండేటితో ఇది నా మూడో సినిమా. ప్రాణం పెట్టి పనిచేశాడు.’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇకనుంచి అక్కినేని విజయాల పరంపర మొదలైనట్టేనని, త్వరలో చైతూతో ‘తెనాలి రామకృష్ణ’ చేయబోతున్నామని, ఆ పాత్రలో లెజెండ్రీ అక్కినేనిని తలపించేంత గొప్పగా చైతూను ప్రెజెంట్ చేయబోతున్నామని దర్శకుడు చందూ మొండేటి తెలిపారు. ఇంకా అతిథిగా విచ్చేసిన సి.అశ్వనీదత్‌తో పాటు అల్లు అరవింద్, దేవిశ్రీప్రసాద్, బన్నీవాసు చిత్రయూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.