Aaryan OTT | తమిళ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో నవంబర్ 28 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో విష్ణు విశాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రముఖ న్యూస్ ఛానెల్లో నయన (శ్రద్ధా శ్రీనాథ్) హోస్ట్ చేస్తున్న లైవ్ షోకి ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఆకస్మాత్తుగా వస్తాడు. చేతిలో గన్ పట్టుకుని అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తాడు. తాను ఒక ఫెయిల్యూర్ రచయితనని, ప్రపంచాన్ని కదిలించే ఒక థ్రిల్లింగ్ కథ చెబుతానని ప్రకటించి రాబోయే ఐదు రోజుల్లో ఐదుగురిని చంపుతానని… అది కూడా ఎవరు చనిపోతారో ముందుగానే చెప్పి మరీ చంపేస్తానని సవాల్ విసురుతాడు. అయితే ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే, ఆత్రేయ తనను తాను గన్‌తో కాల్చుకుని అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ హై-ప్రొఫైల్ కేసు చేధించే పనిని అధికారులు పోలీస్ ఆఫీసర్ నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ చనిపోయినా కూడా అతను చెప్పినట్లే వరసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. దీంతో పోలీసులందరూ అయోమయంలో పడతారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆత్రేయ చెప్పినట్లు హత్యలు ఎవరు చేస్తున్నారు? అసలు ఆత్రేయ ఎవరు? అతను ఈ వ్యక్తులనే ఎందుకు చంపాలని అనుకున్నాడు? చివరకు పోలీస్ ఆఫీసర్ నంది ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్నదే సినిమా మిగతా కథ.
Oru writer oda next masterpiece oru crime ah irundha? 😮🚨 pic.twitter.com/kfaKVLGTGi
— Netflix India South (@Netflix_INSouth) November 22, 2025