WAR 2 | బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వార్’ సినిమాకు కొనసాగింపుగా, వార్ 2 చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇపుడు ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఈ సినిమా, ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే డబ్బింగ్, చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది.
‘వార్ 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. YRF స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా వస్తున్న ఈ సినిమా, ఒక సరికొత్త ప్రమోషనల్ ప్లాన్‌తో ప్రేక్షకులని అలరించే ప్లాన్ చేస్తుంది. YRF అనేక సందర్భాలలో ఈ రకమైన ప్రత్యేక ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేయడంలో విజయం సాధించింది. మూవీ ప్రమోషన్స్ సమయంలో హృతిక్ , ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికని పంచుకోరని, మూవీ రిలీజ్‌కు ముందు ఏ ప్రమోషనల్ వీడియోలోనూ ఉండరని పేర్కొంది. ఎన్టీఆర్, హృతిక్ వేర్వేరుగా సినిమాని ప్రమోట్ చేస్తారు. వారు ఒకరినొకరు చూసుకోరు . హృతిక్ ఎన్టీఆర్ కాంబో ఓ అద్భుతం. వారిద్దరూ స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి మారణహోమం సృష్టిస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్‌గా అందించాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాం అని టీం వర్గాలు తెలిపాయి.
గతంలో కూడా ‘వార్’ సినిమా సక్సెస్ మీట్లో మాత్రమే హృతిక్ , టైగర్ ష్రాఫ్ ఒకే స్టేజిపై కనిపించారు. అలాగే ‘పఠాన్’ సినిమా ప్రమోషన్లలో కూడా షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా తన ప్రమోషన్ స్టైల్‌ను చూపించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ‘వార్ 2’ టీజర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఒక క్రేజీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. “నా కళ్లు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్. ‘రా’లో బెస్ట్ ఏజెంట్ నువ్వే. కానీ, ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలియదు. కానీ, ఇప్పుడు తెలుసుకుంటావ్. గెట్ రెడీ ఫర్ వార్” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకి పూనకాలు తెప్పించింది. చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్సులు ఉండనున్నాయని దర్శకుడు చెప్పారు. సినిమాలో హృతిక్ రోషన్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.