దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, దీపిక పిల్లి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. సాయి బాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు. ఆగస్టు 19న ఈ సినిమా రిలీజ్ కానున్నది. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ…‘ఓటీటీ వల్ల థియేటర్లలో చిన్న చిత్రాలకు ఆదరణ దక్కడం కష్టంగా ఉంది. చిన్న సినిమాగా మీ ముందుకొస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. ఈ సినిమా స్క్రిప్టు సమయంలోనే బాగా నవ్వుకున్నాం. సెట్లో మూడు రోజులు ఉందామని వెళ్లి పది రోజులు గడిపాను. అక్కడ ప్రతి రోజూ నవ్వులే.
ఇదొక మ్యూజికల్ ఎంటర్టైనర్. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే అలవాటును ఈ చిత్రంతోనూ కొనసాగించాను’ అన్నారు. దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ…‘ఈ సినిమాతో దర్శకుడు కావాలన్న నా కల నెరవేరింది. చిత్రీకరణ సమయంలో నాకు కొండంత అండగా నిలబడ్డారు రాఘవేంద్రరావు గారు. ఆయన తరహా పాటలు ఆకట్టుకుంటాయి. ప్రతి సీన్ నవ్వుకునేలా ఉంటుంది’ అన్నారు. రాఘవేంద్రరావు సినిమాలో నటించే అవకాశం దక్కడమే మా అదృష్టం అన్నారు హీరో హీరోయిన్లు సుధీర్, దీపిక పిల్లి. ఈ కార్యక్రమంలో నిర్మాత జోసెఫ్, నటులు సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.