Mohan Lal | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ (Vrusshabha) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాల మధ్య 2025 చివరలో విడుదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సుమారు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లో కేవలం రూ. 1.94 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి కేవలం రూ. 60 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు వసూళ్లను రాబట్టగా.. ఇది మోహన్ లాల్ కెరీర్లోనే అత్యంత బలహీనమైన ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం అసలు లేదనే చెప్పాలి. ఇక్కడ కేవలం రూ. 32 లక్షల వసూళ్లకు పరిమితమైంది.
పునర్జన్మల నేపథ్యం ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అయితే, దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమవ్వడం, కథనం మరీ పాతకాలం నాటిదిగా ఉండటం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అంతేగాకుండా భారీ బడ్జెట్ సినిమా అన్నప్పటికీ, తెరపై కనిపించిన వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత చాలా తక్కువగా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారు. అలాగే మొదటి షో నుంచే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు రావడం సినిమా పాలిట శాపమైంది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే (Break-even) దాదాపు రూ. 150 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉండేది. కానీ, కనీసం బడ్జెట్లో 10% కూడా రికవరీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కేరళలో సైతం డిమాండ్ లేకపోవడంతో ఇప్పటికే చాలా థియేటర్ల నుండి ఈ సినిమాను తొలగిస్తున్నారు. మొత్తానికి 2025లో భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘వృషభ’ మిగిలిపోనుంది.