తమిళంలో సుపరిచితులైన సంగీత దర్శక ద్వయం వివేక్ అండ్ మెర్విన్ ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ హీరోగా మహేష్‌బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా బుధవారం మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మెర్విన్ విలేకరులతో మాట్లాడారు. తమిళంలో ఇప్పటికే 20 సినిమాలు చేశామని, ఏడాది క్రితమే హీరో రామ్ కాల్ చేసి ఈ సినిమా ఆఫర్ ఇచ్చారని అన్నారు. ‘ఈ సినిమా కథ 2002లో జరుగుతుంది కాబట్టి కొంచెం రెట్రో ఫీల్‌తో మ్యూజిక్ ఉండేలా చూసుకున్నాం. ఇందులో మొత్తం ఏడు పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.
కేవలం మ్యూజిక్‌పైనే దృష్టిపెట్టకుండా పాటల్లో సాహిత్యానికి కూడా చాలా ప్రాధాన్యతనిచ్చాం. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలోని భావాలను ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. హీరో రామ్ రాసిన ‘చిన్ని గుండెలో..’ పాట అద్భుతంగా వచ్చింది. మేము ట్యూన్ ఇస్తే దానికి అనుగుణంగా రామ్ చక్కటి పాట రాశారు. రామ్‌గారి మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది. భారతీయ పాటలతో పాటు వెస్ట్రన్ సాంగ్స్ మీద కూడా ఆయనకు పట్టుంది’ అని వివేక్ అండ్ మెర్విన్ తెలిపారు. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్ స్ఫూర్తితో తాము మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యామని, తెలుగు సంగీతాన్ని కూడా బాగా ఇష్టపడతామని, భవిష్యత్తులో తమిళంతో పాటు టాలీవుడ్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తామని వారు పేర్కొన్నారు.