Vivek Agnihotri | ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎట్టకేలకు స్పందించాడు. ఓ మూవీ షూటింగ్లో అగ్నిహోత్రి తనతో నీచంగా ప్రవర్తించాడని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో కేరళ ఫైల్స్ దర్శకుడు మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో కళాకారులపై చాలా ఒత్తిడి ఉంటుంది. విజయం సాధించలేకపోయినప్పుడు వారంతా నిరాశకు గురవుతారు. మానసిక స్థితిని సైతం నిర్వహించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు వారు నియంత్రణ లేకుండా ఉంటారు. ఇలాంటి విషయాలపై పెద్దగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి విషయాలపై నాకు ఇష్టం లేదు. ఎవరో చెప్పే దానికి స్పందించడం నా స్వభావం కాదు. నేను ఎప్పుడూ క్షమించడం నేర్చుకున్నాను. అందుకు నేను ఈ విషయాలను విస్మరిస్తాను’ అని చెప్పుకొచ్చారు. దర్శకుడి వ్యాఖ్యలపై మళ్లీ తనుశ్రీ దత్తా స్పందించలేదు. వివేక్ అగ్నిహోత్రి సినిమాల విషయానికి వస్తే ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రాలతో ముఖ్యాంశాల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 5న విడుదల కానున్నది.
ఇదిలా ఉండగా.. తనశ్రీ దత్తా 2005లో వివేక్ అగ్నిహోత్రితో కలిసి ‘చాక్లెట్’ మూవీలో నటించింది. కొద్దిరోజుల కిందట ఓ ఇంటర్వ్యూలో తనుశ్రీ మాట్లాడుతూ.. తాను ఐదు నిమిషాలు ఆలస్యంగా సెట్‌కు వచ్చానని.. ఆ సమయంలో వివేక్ అగ్నిహోత్రి తనపై అరిచాడని.. అసభ్య వ్యాఖ్యలు చేశాడని ఆరోపించింది. తాను సెట్‌కు వచ్చానో.. లేదో తెలుసుకునేందుకు సెట్లోకి వచ్చేవాడని ఆరోపించింది. అంతే కాకుండా చాక్లెట్ షూటింగ్ సమయంలోనే.. తాను ధరించిన కాస్ట్యూమ్స్ ఎక్స్పోజింగ్ ఉండడంతో పైన కప్పుకున్న టవల్ లాంటి కోట్ ధరించి కూర్చున్నానని.. ఆ సమయంలో ఇర్ఫాన్ ఖాన్‌పై షాట్ చిత్రీకరించాల్సి ఉందని.. అయినా అగ్నిహోత్రి తన వక్ర బుద్ధిని చూపించాడని.. ఇర్ఫాన్ ఖాన్‌కి సెక్సీగా ముఖ కవళికలు చూపించాలి.. టవల్ తీసేసి డాన్స్ చేయి అంటూ నీచంగా మాట్లాడడని ఆరోపించారు. తాను షాట్లో కనిపించనని.. ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే కనిపిస్తాడని.. తాను పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేకపోయినా.. దర్శకుడు మరో ఉద్దేశంతో మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో నటులు ఇర్ఫాన్ సునీల్ శెట్టి అండగా నిలిచారని.. డైరెక్టర్‌ను మందలించారంటూ చెప్పుకొచ్చింది.