Vishwambhara Movie | ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.360 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరు ఇప్పుడు తన తదుపరి సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’ను వెండితెరపైకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనుల వలన ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకోవడంతో, జూలై తొలి వారంలో ముఖ్యంగా జూలై 9 లేదా 10వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో చిరంజీవి కూడా సానుకూలంగా స్పందిస్తూ, జూలైలో సినిమా వచ్చే అవకాశముందని ధృవీకరించినట్లు తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ సుమారు రూ.75 కోట్ల వరకు కేవలం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.