అగ్రహీరో చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియా ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ అంతర్జాతీయ ఫెస్టివల్లో ‘విశ్వంభర’ చిత్రం చర్చనీయాంశమైంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విక్రమ్‌రెడ్డి.. కేన్స్ ఫెస్టివల్లో ‘విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్’ను లాంచ్ చేశారు. తదనంతరం ‘విశ్వంభర’ కథ, భారతీయ పురాణాల విశిష్టత, బుక్ విశేషాలను ఆహుతులకు వివరించారు.
దీంతో.. ఈ మెగా మాస్ మూవీ మేనియా సరిహద్దులు దాటి గ్లోబల్‌కి చేరినట్టయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాప్ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయని, నిర్మాణం పూర్తయ్యాక, విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కునాల్ కపూర్ మరో ముఖ్యపాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.