Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని బింబిసార ఫేం దర్శకుడు వశిష్ట పూర్తి సోషియో ఫాంటసీ సినిమా గా తీసుకురాబోతున్నాడు .. ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు వచ్చినా కూడా అభిమానులు ఎంతో ఆసక్తి గా గమనిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ నుండి రామ రామ సాంగ్ విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి ఆ పాట విడుదలైంది.
రాములోరి గొప్ప చెప్పుకుందామా… ‘రాములోరి గొప్ప చెప్పుకుందామా… సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగే ఈ గీతాన్ని సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి బాణీలు అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. పాట ప్రారంభంలో ‘జై శ్రీరామ్’ అంటూ వచ్చే చిరంజీవి వాయిస్ ఒకటి డివోషనల్ వైబ్ తీసుకొచ్చింది అనే చెప్పాలి. గతంలో చిరంజీవి సినిమాలలో కొన్ని భక్తి గీతాలు ఉన్నాయి. కాని దీని స్పెషాలిటీ ఏంటంటే చిరుకి ఇష్ట దైవమైన హనుమంతుని చుట్టూ పాట సాగుతుంది. ఈ పాటకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీనిని యువి క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష కథానాయికగా నటిస్తుంది . ‘అమిగోస్’, ‘నా సామి రంగ’ సినిమాల ఫేమ్ ఆశికా రంగనాథ్ మరొక హీరోయిన్. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నారు. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో చిరు బిగ్ హిట్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.