Vishwambhara | ‘బింబిసార’ సినిమాతో సంచలన హిట్ కొట్టిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో-ఫాంటసీ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీజర్ విడుదల కాగా, ఆ సమయంలో కొంత నెగిటివిటీ ఎదురైనా, ఇప్పుడు వశిష్ఠ తన మాటలతోనే కాకుండా, కంటెంట్‌తోనే గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ..“టీజర్ వచ్చినప్పుడు కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కావాలనే నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ట్రైలర్ చూసాక వాళ్లకు నోట మాట రాకపోవచ్చు. సినిమా అయితే అంచనాలకు మించి ఉంటుంది అని స్పష్టం చేశారు.
వశిష్ఠ సినిమా కథను కూడా బయటపెట్టాడు . భారతీయ పురాణాల ప్రకారం, పైన ఏడూ, కింద ఏడూ.. మొత్తం 14 లోకాలు ఉంటాయి. అయితే ఈ చిత్రం 15వ లోకం అయిన ‘విశ్వంభర’ చుట్టూ తిరుగుతుంది. ఆ లోకంలో ఉండే నాయిక కోసం హీరో చేసే ప్రయాణమే ప్రధాన కథాంశమని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని లుక్‌లో, మాయాజాలంతో కూడిన ప్రపంచంలో చూపించబోతున్న వశిష్ఠ, ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఎక్కువ మేజిక్ చేస్తానంటున్నాడు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
విశ్వంభర టీజర్ తర్వాత గ్రాఫిక్స్ విషయంలో వచ్చిన విమర్శలపై నిర్మాతలు సీరియస్ అయ్యారు. అందుకే హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు.ఈ సినిమాలో 4,676 VFX షాట్స్ ఉంటాయని వశిష్ఠ చెప్పాడు. గ్రాఫిక్స్ కోసం రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ కలిగిన ప్రాజెక్ట్ అవుతుందని చెబుతున్నారు.ఇటీవల విడుదలైన ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కీరవాణి మార్క్ మ్యూజిక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్రాఫిక్స్ పనులు పూర్తికాగానే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మెగాస్టార్ అభిమానులు, సోషియో ఫాంటసీ జానర్ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.