Vishwambara | ఒకప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ అన్నా హాలీవుడ్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ గొప్పగా ముందుకు సాగుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు అత్యాధునిక గ్రాఫిక్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందిస్తున్నారు. అయితే అందరూ విజయవంతం కాలేరు. కొన్ని చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నిరాశపరిచాయి. ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కథ బలంగా ఉన్నప్పటికీ, తక్కువ నాణ్యత గల గ్రాఫిక్స్ వల్లే సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” కూడా గ్రాఫిక్స్ పరంగా విమర్శలకు గురైంది. ప్రేక్షకులు సినిమా కథపై ఆసక్తి చూపినా, గ్రాఫిక్స్‌లో నాణ్యత లేకపోవడం వల్ల నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా విడుదలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్, గ్రాఫిక్స్ క్వాలిటీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు కేవలం స్పెషల్ అట్రాక్షన్ కాదు, అది సినిమా విజయంలో కీలక అంశంగా మారింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై ఉంది.
జానపద నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే విడుదలైన టీజర్‌కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. టీజర్‌లోని గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. “హరిహర వీరమల్లు”, “వార్ 2” లాంటి చిత్రాలు ఎదుర్కొన్న విమర్శలు ఇప్పుడు “విశ్వంభర”కి వార్నింగ్ బెల్ లా మారాయి. ఈ సినిమా విజయం, గ్రాఫిక్స్ క్వాలిటీపై చాలా ఆధారపడి ఉంటుంది. దర్శకుడు వశిష్ఠ ఈ విషయంలో ఎంత మేర జాగ్రత్తలు తీసుకుంటారో, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ అందుకుంటారో చూడాలి.