Vishwaksen Replaces Sharwanand | తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో కథానాయకుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఇప్పటికే అలా ఎన్నో కథలు ఒక హీరో దగ్గర నుండి మరో హీరో దగ్గరికి వచ్చి బ్లాక్బస్టర్ విజయాలు సాధించినవి ఉన్నాయి. తాజాగా మరో ఒక యంగ్ హీరోతో అనుకున్న కథను మరో యంగ్ హీరో పట్టుకుపోయాడు. ఇంతకీ ఆ యంగ్ హీరోలు ఎవరా అనుకుంటున్నారా? వారెవరో కాదు శర్వానంద్, విశ్వక్సేన్.
గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న శర్వా గతేడాది ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి ఫామ్లోకి వచ్చాడు. అదే జోరులో ‘ఛల్మోహన్ రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్యతో సినిమాను పట్టాలెక్కించాడు. రాశిఖన్నాను హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఊసే లేదు. కాగా తాజాగా ఈ సినిమా నుండి శర్వా తప్పుకున్నట్లు తెలుస్తుంది. కారణాలేంటో తెలియదు కానీ ఇదే కథను విశ్వక్ సేన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
అయితే ఈ ప్రాజెక్ట్ను ముందుగా అనుకున్నట్లుగా పీపుల్ మీడియా కాకుండా సితార సంస్థ నిర్మించనుందట. ఇటీవలే విశ్వక్ సితార బ్యానర్లో ఓ సినిమా బాకీ ఉందని తెలిపాడు. బహుశా ఆ ప్రాజెక్ట్ ఇదే కాబోతుందని టాక్. ప్రస్తుతం విశ్వక్ ‘దాస్ కా ధమ్కీ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే.