Vishwak sen Laila Movie Review | భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో..ఇవన్నీ హీరోలు అమ్మాయిల పాత్రలు ధరించి అలరించిన చిత్రాలు. ఈ తరహా చిత్రాలు తెలుగులో వచ్చి చాలా కాలమైయింది. ఇప్పుడా లోటుని భర్తీ చేయడానికి విశ్వక్ సేన్ ‘లైలా’తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మాస్ ఇమేజ్ వున్న హీరో విశ్వక్. అలాంటి విశ్వక్ అమ్మాయి పాత్రలోకి మారడం ఆసక్తిని పెంచింది. ప్రచార చిత్రాలతో పాటు, ఈ క్యారెక్టర్ తన కెరీర్ లో గుర్తిండిపొతుందని స్వయంగా విశ్వక్ చెప్పడం బజ్ ని క్రియేట్ చేసింది. మరి విశ్వక్ నమ్మకం నిజమైయిందా ? నిజంగా లైలా విశ్వక్ కెరీర్ లో మెమరబుల్ సినిమానా? రివ్యూలో చూద్దాం.
కథ: సోనూ (విశ్వక్ సేన్ )పాతబస్తీలో ఫేమస్ బ్యూటీషియన్. దిల్ దార్ యాటిట్యూడ్ లోకల్ మోడల్. బ్యూటీ పార్లర్ తనకి బిజినెస్ మాత్రమే కాదు అదొక సెంటిమెంట్. అనుకోని పరిస్థితిలో సోను ఓ సమస్యలో పడతాడు. ఆ సమస్య నుంచి తెలివిగా తప్పించుకోవడానికి లైలా అవతారం ఎత్తుతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు సోనుకి వచ్చిన సమస్య ఏమిటి ? లైలా గెటప్ తో తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరికి ఆ సమస్యని ఎలా పరిష్కరించాడనేది తెరపై చూడాలి.
విశ్లేషణ : కథలో భాగంగా ఇతర పాత్రలని మభ్యపెట్టడానికి హీరోలు మహిళలుగా మారాల్సివస్తుంది. పైన ప్రస్థావించిన దాదాపు సినిమాలన్నీ ఇదే తరహా అల్లికతోనే వుంటాయి. అయితే ఓ పాత్ర అమ్మాయి గా మారడానికి కారణం, మారిన తర్వాత ఆ పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకునే తీరులో వైవిధ్యమే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. కథ పరంగా చూస్తుంటే లైలా కూడా ఓ రొటీన్ లేడి గెటప్ మూవీనే. కథలో ఓ ప్రత్యేకమైన పాయింట్ ఏమీ కనిపించదు. దర్శకుడు కేవలం వినోదంపైనే ఆధారపడి సినిమా అంతా నడిపాడు. అయితే అ వినోదంలో సహజత్వం లోపించింది. దాదాపు సన్నివేషాలు సరిగ్గా పండలేదు.
సోను క్యారెక్టర్ పరిచయం, ఓ సాంగ్, ఫైట్, లవ్ ట్రాక్.. ఇలా రొటీన్ మూసలో కథ మొదలౌతుంది. హైదరబాదీ నేపధ్యంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినప్పటికీ అవేవి కథ గమనానికి కలిసిరావు. ఇక సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ లైలా పాత్ర సెకండ్ హాఫ్ లో తెరపైకి వస్తుంది. విశ్వక్ లైలా గా కనిపించేడమే సర్ ప్రైజ్ అనుకున్నారేమో కానీ దర్శకుడు ఆ పాత్ర చుట్టూ సరైన కథనం అల్లుకోలేదు. ఒక దశలోకి వచ్చేసరికి సినిమా పూర్తిగా ఊహకు అందిపోతుంది. లైలా పాత్రలో విశ్వక్ మంచి ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ నిస్తేజమైన కథనం, పాత్రలతో ప్రేక్షకులు కొరుకునే వినోదం ఇవ్వడంలో గాడితప్పుతుంది.
నటీనటులు: నటన పరంగా విశ్వక్ కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే. సోను పాత్ర తనకు అలవాటైనదే. ఆ పాత్రలో తన ఎనర్జీ బావుంది. తన స్టయిల్ క్యారెక్టర్ కి సరిగ్గా నప్పింది. లైలా లాంటి క్యారెక్టర్ చేయాలంటే యాక్టర్ కి ధైర్యం కావాలి. చాలా డేరింగ్ తో ఆ క్యారెక్టర్ చేశాడు. తన వరకూ డైరెక్టర్ ని ఫాలో అవుతూ వెళ్ళాడు. క్యారెక్టర్ లో తన ఎఫర్ట్ కనిపిస్తుంది. రెండు పాత్రలకు తగిన న్యాయం చేశాడు. ఆకాంక్ష శర్మ ది గ్లామరస్ రోల్. బబ్లూ పృద్వీరాజ్ పాత్ర ఓకే అనిపిస్తుంది. అభిమన్యు సింగ్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. మిగతా నటులు పరిధిమేర కనిపిస్తారు.
టెక్నికల్ గా ఎలా వుంది: లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఎనర్జీటిక్ గా వుంది. పాటలు అలరిస్తాయి. అయితే కథలో బలం లేకపోవడంతో బీజీఎం పార్ట్ తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రిచర్డ్ ప్రసాద్ విజువల్స్ డీసెంట్ గా వున్నాయి. షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు కథకు తగట్టుగా వున్నాయి. యూత్ ఫుల్ సినిమా అన్నారు కానీ చాలా చోట్ల అడల్ట్ డైలాగ్స్ వినిపిస్తాయి. దర్శకుడు రామ్ నారాయణ్ కథ, కథనం ఇంకాస్త దృష్టి పెట్టివుంటే లైలా ఇంకాస్త మెరుగ్గా అలరించేది.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ నటన, లైలా గెటప్
కొన్ని కామెడీ సీన్స్
మ్యూజిక్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ, కథనం
పసలేని కామెడీ
వీక్ డైరెక్షన్
రేటింగ్: 2.5/5