విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’. మిథిలా పాల్కర్, ఆశా భట్ నాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించనున్నారు. దీపావళి పండక్కి ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘నా కెరీర్ ఈ సినిమాకు ముందు తర్వాత అనేలా పేరు తెస్తుందని ఆశిస్తున్నా. వినోదం, భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది. నా ఫలక్‌నుమా దాస్ సినిమా ట్రైలర్ విడుదల చేసి దేవుడిలా ఆదుకున్న వెంకటేష్ గారు ఈ చిత్రంలో దేవుడు పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. అలాంటి ఒక సోదరుడు ఉండాలని అనిపించింది. ఆశా భట్, మిథిలా పాల్కర్ నటన ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మాట్లాడుతూ..‘మా సంస్థలో వైవిధ్యమైన సినిమాల్ని నిర్మించాం. తొలిసారి ఓ యూత్‌ఫుల్ సినిమా చేస్తున్నాం’అన్నారు. తెలుగు సినిమా తెరకెక్కించాలనే నా కల ఈ చిత్రంతో తీరింది అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు అన్నారు.