ఇక నుంచి అభిమానుల అభిప్రాయాలను గౌరవిస్తానని, క్లాస్..మాస్ ఏ సినిమా అయినా అసభ్యతకు తావులేకుండా చూసుకుంటానని యువ హీరో విశ్వక్సేన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలకాలంలో తాను నటించిన కొన్ని చిత్రాలు అనుకున్న ఫలితాలను సాధించలేదని, ఇక ముందు ప్రేక్షకుల మెచ్చే సినిమాలు చేస్తానని విశ్వక్సేన్ పేర్కొన్నారు. ‘ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. నా గత చిత్రానికి మీరు ఇచ్చిన నిర్మాణాత్మక విమర్శను స్వీకరిస్తున్నా. నా ప్రయాణంలో తోడుగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా. నేను కొత్త కథలకు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తాను.
ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తాను. ఒకవేళ చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు మీకుంది. మీ అశీస్సుల వల్లే నా సినీ ప్రయాణం సాగుతున్నది. కేవలం సినిమాలు మాత్రమే కాదు..ఇకపై ప్రతి సన్నివేశం మీరు మెచ్చేలా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో ఓ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నా. నా సక్సెస్, ఫెయిల్యూర్స్లో నా వెంట నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు’ అని విశ్వక్సేన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశ్వక్సేన్. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన ఫలితాల్ని రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కేవీ అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ సినిమాలో నటిస్తున్నారు విశ్వక్సేన్.