Vishal Bhardwaj | ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పని ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు, ప్రాపగండా అంటూ విమర్శలను ఎదుర్కొంటున్న ‘ధురంధర్ 2’ చిత్రంపై ఒక నెటిజన్ ఈ సినిమా నచ్చిన ప్రేక్షకులు జర్మన్ నాజీ సైనికులతో సమానం అంటూ ఒక రీల్ చేశాడు. అయితే ఈ రీల్‌ను లైక్ చేశాడు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఒక ఎక్స్ వినియోగదారుడు దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ, ‘హైదర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ధురంధర్ ప్రేక్షకులను జర్మనీ నాజీలతో పోల్చిన పోస్ట్‌ను లైక్ చేశారు. జాకీర్ ఖాన్ చెప్పినట్లు ధురంధర్ విజయం చూసి అందరికీ మండుతున్నట్లుంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. సదరు రీల్లో హిట్లర్‌కు సెల్యూట్ చేయడానికి నిరాకరించిన ఆగస్ట్ ల్యాండ్మెస్సర్ ఫోటోను వాడుతూ, ధురంధర్ సినిమా చూసిన వారిని నాజీలతో పోల్చడం వివాదాస్పదమైంది.
అయితే ఈ విషయంలో విశాల్ భరద్వాజ్‌కు మద్దతుగా కూడా కొందరు నెటిజన్లు నిలుస్తున్నారు. సినిమాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందని, ఆయన ఒక వ్యక్తిగత పౌరుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదని రెడ్డిట్ వంటి వేదికలపై చర్చ జరుగుతోంది. ధురంధర్ 2 చిత్రంలో అధికార పార్టీకి చెందిన కొన్ని ప్రచార అంశాలు ఉన్నప్పటికీ అది ఒక మంచి చిత్రమని, అభిప్రాయ భేదాలను గౌరవించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్ కాస్ట్‌తో అలరించిన ఈ చిత్రం త్వరలోనే జియో హాట్‌స్టార్‌లో భారీ ధరకు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. కేవలం ఎనిమిది వారాల్లోనే ఇది డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని సమాచారం.