Virender Sehwag | టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. మహేష్ బాబే తనకు అత్యంత ఇష్టమైన తెలుగు హీరోనని వెల్లడించిన సెహ్వాగ్.. దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు చిత్రాలను ఎక్కువగా చూస్తానని చెప్పాడు. తెలుగు, తమిళ్ భాషలు రాకపోయినా హిందీలో డబ్ అయిన ప్రతి సౌతిండియన్ సినిమాను తప్పకుండా చూస్తానని స్పష్టం చేశాడు.హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ సందర్భంగా టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబుతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.
రిటైర్మెంట్ తర్వాత నాకు చాలా ఖాళీ సమయం దొరుకుతోంది. అందుకే దక్షిణాది సినిమాలు ఎక్కువగా చూస్తున్నాను. నా ఫేవరేట్ తెలుగు హీరో మహేష్ బాబు. ఆయన సినిమాలు చాలానే చూశాను. అల్లు అర్జున్ కూడా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా నాపై గొప్ప ప్రభావం చూపింది. ‘పుష్ప-1’, ‘పుష్ప-2’ సినిమాలను ఇప్పటికే రెండు, మూడు సార్లు చూశాను. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్, అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ నా మైండ్‌లో ఉన్నాయి అని సెహ్వాగ్ తెలిపారు. అలాగే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రెండుసార్లు చూశానని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా ఉందని, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని సెహ్వాగ్ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ వ్యాఖ్యానించారు.
2015లో రిటైర్ అయ్యాను. ఇక నాకు చేయడానికి పని ఏం ఉంది? ఖాళీగా ఉన్నప్పుడు మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నాను అంటూ సరదాగా అన్నారు. ఈ కార్యక్రమంలో సెహ్వాగ్‌తో పాటు క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సురేశ్ రైనా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ప్రో లీగ్ టోర్నమెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ ప్రో లీగ్ అనేది టాలీవుడ్‌కు సంబంధించిన సరికొత్త క్రికెట్ లీగ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ లీగ్‌కు నిర్మాత దిల్ రాజు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, మొత్తం 6 జట్లు పోటీ పడనున్నాయి. ఏడాదికి రెండు సీజన్ల చొప్పున ఈ లీగ్ నిర్వహించనున్నారు. సినీ నటులు, టెక్నీషియన్లు, సినీ ప్రముఖులు ఆటగాళ్లుగా బరిలోకి దిగనుండగా, ప్రముఖ నిర్మాతలు ఆయా జట్లకు యజమానులుగా వ్యవహరించనున్నారు. టాలీవుడ్ ప్రో లీగ్ తొలి సీజన్ ఫిబ్రవరి 13, 2026 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.