Gauri Khan Restaurant | పలువురు క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హోటల్ బిజినెస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ హోటల్స్‌లో తమ కస్టమర్లకు కల్తీ ఆహార పదార్థాలు ఇస్తున్నారా? లేదా? అతని తెలుసుకునేందుకు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆయా రెస్టారెంట్లకు వెళ్లాడు. ఓ స్టార్ హీరో భార్య నిర్వహిస్తున్న హోటల్‌కు వెళ్లగా.. అక్కడ ఫేక్ పనీర్ ఇస్తున్నట్లు తేలింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఆరోపణలను రెస్టారెంట్ తోసిపుచ్చింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సార్థక్ సచ్‌దేవా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు తమ హోటల్స్‌లో వడ్డిస్తున్న పనీర్‌పై అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ యాజమాన్యంలో ‘వన్ 8 కమ్యూన్, శిల్పా శెట్టి ‘బాస్టియన్’, బాబీ డియోల్ ‘సమ్‌ప్లేస్ ఎల్స్’ షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ యాజమాన్యంలో ‘టోరీ’ ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లాడు. ఆయా రెస్టారెంట్లలో వడ్డించే పనీర్‌పై టెస్ట్ చేశాడు. అయితే, గౌరీ ఖాన్ టోరీ రెస్టారెంట్లో పనీర్‌ను పరీక్షించిన సమయంలో ఫేక్‌గా తెలిపాడు. అందరు సెలబ్రిటీలు అందిస్తున్న పనీర్‌పై అయోడిన్ టింక్చర్ చేయగా.. ఎలాంటి తేడాలు కనిపించలేదు.
కానీ, గౌరీ ఖాన్ హోటల్లో ఆర్డర్ ఇచ్చిన పనీర్‌పై అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేయగా.. నల్లగా మారడంతో ఫేక్‌గా చెప్పాడు. పనీర్‌తో సహా పలు ఆహార పదార్థాల్లో స్టార్చ్‌ను గుర్తించేందుకు అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేయడం సాధారణ పద్ధతి. సహజంగా తయారు చేసిన పనీర్‌లో స్టార్చ్ ఉండకూడదని.. పనీర్‌తో స్టార్చ్ కలిసినప్పుడు అయోడిన్ నీలం-నలుపు రంగులోకి మారితే అది కల్తీగా పేర్కొంటారు. అయితే, దీనిపై టోరీ రెస్టారెంట్ స్పందించింది. అయోడిన్ టింక్చర్ టెస్ట్ స్టార్చ్ ఉనికిని మాత్రమే చూపిస్తుందని.. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నందున వల్లే అలాంటి రియాక్షన్ వచ్చిందని, ఫేక్ కాదని పేర్కొంది. తాము అందించే పనీర్ నాణ్యమైందని స్పష్టం చేసింది. దీనిపై గౌరీఖాన్ మాత్రం స్పందించలేదు.