వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకుడు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. శుక్రవారం ‘వైరల్ వయ్యారి..’ అనే గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతాన్ని కల్యాణ్ చక్రవర్తి రచించారు.
‘ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్ చూశావంటే మైండ్‌బ్లోయింగ్.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగ్.. నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగ్..’ అంటూ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సోషల్‌మీడియాలో వాడే లాంగ్వేజ్‌తో ట్రెండీగా ఈ పాట సాగింది. దేవిశ్రీప్రసాద్, హరిప్రియ ఆలపించారు. ఇందులో కిరీటి రెడ్డి, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. జెనీలియా, రవిచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన-దర్శకత్వం: రాధాకృష్ణ.