Vinaro Bhagyamu Vishnu Katha Movie | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి స్పీడ్ చూపించిన కిరణ్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండేళ్ళుగా హిట్టుకు దూరమయ్యాడు. గతేడాది కిరణ్ ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కిరణ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు ఇప్పుడు హిట్టు చాలా అవసరం. అంతేకాకుండా ఆయన మార్కెట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం కిరణ్ ఆశలన్నీ ‘వినరో భాగ్యము విష్ణుకథా’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు కాస్త బజ్ క్రియేట్ చేశాయి. కానీ ప్రేక్షకుల్లోకి ఈ సినిమా వెళ్లాలంటే ఆ బజ్ సరిపోదు. ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచాలి.
ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే ఈ సినిమా చుట్టూ పెద్ద పోటీ వ్యూహమే ఉంది. అదే రోజున సమంత ‘శాకుంతలం’ విడుదల కాబోతుంది. ‘యశోద’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత నుండి వస్తున్న సినిమా కావడంతో శాకుంతలంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాను దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాకు అధిక శాతంలో థియేటర్లు దొరుకుతాయి.
ఇక అదే రోజున ధనుష్ ‘సార్’ కూడా రిలీజ్ కానుంది. ‘తిరు’తోనే తెలుగులో దాదాపు రూ.10 కోట్ల రేంజ్లో కలెక్షన్లు రాబట్టిన ధనుష్ ఈ సారి స్ట్రేయిట్‌గా తెలుగు సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. దీనితో పాటుగా విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ కూడా ఫిబ్రవరి 17నే రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్‌ను విశ్వక్ పెద్ద లెవల్లో ప్లాన్ చేస్తున్నాడని టాక్. అంతేకాకుండా బయ్యర్లు కూడా ఈ సినిమాను కొనడానికి తీవ్ర ఆసక్తిని చూపిస్తున్నారట. ఎందుకంటే టాలీవుడ్లో విశ్వక్ ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. ఆయన సినిమాలు లాభాలు తెచ్చిపెట్టకపోయినా, నష్టాలు మాత్రం తీసుకురావని నిర్మాతలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు, పాటలు ఈ మూవీపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఇన్నీ పెద్ద సినిమాల మధ్య కిరణ్ సినిమా రిలీజ్ కాబోతుందంటే ఏ లెవల్లో ప్రమోషన్స్ ఉండాలి? కానీ చిత్రయూనిట్ ప్రమోషన్ల విషయంలో నత్తనడక సాగిస్తుంది. ప్రమోషన్లలో స్పీడ్ పెంచకపోతే ఈ సినిమా హిట్టవడం కష్టమే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. కాగా ఈ మధ్య ఈ సంస్థ నుండి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మరీ ఈ సినిమా అయినా కిరణ్ వైఫల్యాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.