రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తాలూకు పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్లుగానే జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని చెప్పారు. ఈ కథ రాయడానికే దాదాపు రెండేళ్లు పట్టిందని, అద్భుతమైన కంటెంట్ తో సినిమా రాబోతున్నదని పేర్కొన్నారు. ఆయన మాటలతో మహేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించనున్నారు. భారీ వ్యయంతో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.