Vijayashanti | టాలీవుడ్‌కి పరిచయం అక్కర్లేని పేరు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. 1980ల నుంచి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో స్టార్ హీరోల సరసన బలమైన పాత్రల్లో నటించిన విజయశాంతి, మధ్యలో సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఇటీవల మరోసారి వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మేజర్ పాత్రలో కనిపించి, ఆ తర్వాత ‘అర్జున్ – సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్లతోనూ విజయశాంతి మరోసారి అదరగొట్టి అలరించారు. బాలయ్య అఖండ 2లోను విజయశాంతి నటిస్తుందని ఈ మధ్య వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. దీనిపై క్లారిటీ అయితే లేదు.
విజయశాంతి తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. వాటిలో ప్రతిఘటన చిత్రం కూడా ఒకటి. చిత్రం 1985 అక్టోబర్ 11న విడుదల కాగా, నేటి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో విజయశాంతి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం. నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ “ప్రతిఘటనష. దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి, అద్భుతమైన “ఈ దుర్యోధన దుశ్శాసన” పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావు గారికి, సహ నటి నటులకు, సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదములతో…హర హర మహాదేవ్ .. అని విజయశాంతి రాసుకొచ్చింది.
విజయశాంతి నటిగానే కాదు సామాజిక సేవలోను ఎప్పుడు ముందుంటారు. పిల్లలు లేని విజయశాంతి, తన సంపాదించిన ఆస్తులను సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని నిర్ణయించారు. “నా తల్లి పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం రంగాల్లో సేవలందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నా అని కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చారు . అంతేకాదు, తన వద్ద ఉన్న నగలను అన్ని కూడా తిరుమల వెంకటేశ్వర స్వామివారి హుండీకి సమర్పించనున్నానని ప్రకటించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువెత్తాయి.